క్రిషాంక్ అరెస్ట్ – రేవంత్ అరెస్ట్ !

By KTV Telugu On 3 May, 2024
image

KTV TELUGU :-

సోషల్ మీడియాలో ఉన్న అపరిమిత స్వేచ్చ రాజకీయ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కలుషితం చేసింది. ఫేక్ పోస్టులు.. తప్పుడు వార్తలు ఎలాంటివి పెట్టినా ఢోకా లేదన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు చెలరేగిపోతున్నాయి. అవి ఎంత ఘోరంగా  మారుతున్నాయంటే కుటుంబాలనూ వదిలి పెట్టడం లేదు. నమ్మే వాళ్లు ఉన్నా లేకపోయినా   పుకార్లుగా ప్రచారంలో ఉంటాయన్న ఉద్దేశంతో  ప్రజల్లోకి వదిలేస్తున్నారు. రాజకీయంగా పక్క పార్టీకి డ్యామేజ్ అవుతుందనుకుంటే మరింత బరి తెగిస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న వారు మాత్రం తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేయిస్తున్నారు. తాము మాత్రం అదే తప్పు చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అదే తప్పు చేసినట్లుగా నోటీసులు అందుకున్న రేవంత్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగలరా ?

రాజకీయాల్లో నీతి, నిజాయితీ అనే మచ్చుకు కనిపించడం మానేసి దశాబ్దాలు దాటింది. వాటి స్థానంలో పచ్చి అబద్దాలు చెప్పినా అదే రాజకీయం అనుకునే పరిస్థితి వచ్చింది.  ఆ దుష్పరిణామాలు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి.  సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగాణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్ చేసి.. రిజర్వేషన్ల రద్దుపై తప్పుడు ప్రచారం చేసిందని ఢిల్లీలో కేసు నమోదయింది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కూడా పీసీసీ అధ్యక్షునిహోదాలో నోటీసులు ఇచ్చారు. ఆయన తనకు నాలుగువారాల సమయం కావాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. అదే సమయంలో అదే ఫేక్ పోస్టులు పెట్టి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఉస్మానియా హాస్టల్స్ లో నీరు, కరెంట్ లేదని సెలవులు ఇస్తున్నట్లుగా వార్డెన్ పేరుతో ఓ సర్క్యూలర్ వైరల్ అయింది. దాన్ని క్రిషాంకే పోస్ట్ చేశారు. అది ఫేక్ అని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఈ సర్క్యూలర్ పై దుమారం రేగింది. కేసీఆర్ కూడా ట్వీట్ చేశారు. తర్వాత రేవంత్ కూడా కౌంటర్ కూడా ఇచ్చారు. గోబెల్స్ మళ్లీ పుట్టినట్లగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ సర్క్యులర్ పోస్టు చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూండగానే  కొత్త గూడెం నుంచి  వస్తున్న క్రిషాంక్ ను చౌటుప్పల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రోజంతా అటూ ఇటూ తిప్పి.. ఆయనను అర్థరాత్రి పూట అరెస్టు చూపించారు. క్రిషాంక్ పై ఇది ఆరో కేసు. అన్నీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం.. ప్రసారం చేయడంపైనే.  ఓ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ అయినంత మాత్రాన ఫేక్ న్యూస్ తయారు చేసి అధికార పార్టీని బద్నాం చేయాలన్న రూల్ ఏమైనా ఉందా ?.  క్రిషాంక్ పోస్టులు చూస్తే..  పుకార్లను ప్రజల్లోకి పంపి.. ఏదో ఓ అనుమానం కలిగించాలన్న దురుద్దేశంతో తప్ప..  నిజం ఉండదని కాస్త పరిజ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది.

కానీ క్రిషాంకే ఇలాంటివి చేయడం లేదు. స్వయంగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి వాటిలో ఇరుక్కున్నారు. సిద్ధిపేటలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రసంగిస్తే అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తారని వీడియో ఎడిట్ చేసి ప్రసారం చేశారు.  ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీనే చేసింది.  టీ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు విచారణకు పిలిచారు. ఆయన వెళ్లలేదు.  కానీ ఇదే తరహా కేసులో క్రిషాంక్ ను రేవంత్ సర్కార్ అరెస్టు చేసింది. ఎలా సమర్థించుకుంటారన్నది తెలియదు కానీ అధికారంలో ఉన్న పార్టీ అనుకున్నది చేయగలదు. ఇక్కడ తప్పు క్రిషాంక్ మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సోషల్ మీడియాపోస్టుల పేరుతో వందల మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఓ సారి కాంగ్రెస్ వార్ రూముని కూడా సీజ్ చేశారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇక్కడ ఒక్కరిదే కాదు తప్పు.. అందరిదీ.

సోషల్ మీడియా స్వేచ్చను రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నాయి. ఎంత ఫేక్ చేస్తే..అంత గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అది నిజం కాదని తెలిసినా అమాయకులైన వారు నమ్మేస్తారని కాంగ్రెస్ పై లేదా.. బీఆర్ఎస్ పై లేదా బీజేపీపై ద్వేషం  పెంచుకుంటారని భావిస్తున్నారు. ఫలితంగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా సోషల్ మీడియా విభాగాలు మారిపోయాయి. రాను రాను ఇది వికృత రూపం దాలుస్తోంది. ఫలితంగా రాజకీయ వ్యవస్థ  దారుణంగా తయారవుతోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తోంది.  ఆ వ్యవస్థ మీదనే ఉన్న రాజకీయ  పార్టీలు తమ కొమ్మ తాము నరుక్కుంటున్నామన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాయి.

సోషల్ మీడియాలో  తప్పుడు ప్రచారాలు ఆపేందుకు ఫ్యాక్ట్ చెక్‌లు సరిపోవు. అంతకు మించి కఠినమైన నియంత్రణ ఉండాలని రాజకీయ  పార్టీలే తమ ఘోరాలతో నిరూపిస్తున్నాయి. కానీ ఆ నియంత్రణ తేవాల్సింది కూడా రాజకీయ పార్టీలే కావడం అసలు విషాదం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి