షర్మిల పేరాశ..!

By KTV Telugu On 4 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి ఏం మాట్లాడుతున్నారు. ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారు. ఆమెకు అలా మాట్లాడటం అలవాటా.ఆమె తెలిసే మాట్లాడుతున్నారా..తెలియక మాట్లాడుతున్నారా.. కేవలం పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారా.. లేక కాంగ్రెస్ కేడర్ ను ఉత్తేజ పరిచేందుకు అలా మాట్లాడుతున్నారా.. అన్న ప్రశ్నలు తరచూ  ఉత్పన్నమవుతున్నాయి. త్వరలో తాను కేంద్రమంత్రినవుతానని ఆమె ప్రకటించడం ద్వారా  అలాంటి ప్రశ్నలకు మరింత ఆజ్యం పోశారు..

రాజకీయ నాయకులు ఆశావాదులంటారు. అలాంటి వారే రాజకీయాల్లో మనుగడ సాగిస్తారంటారు. ఎన్ని ఓటములు ఎదురైనా మరోసారి విజయం కోసం వాళ్లు ఎదురుచూస్తారు. షర్మిల కూడా అంతేననుకోవాలి. కాకపోతే ఆమె ఆశలు మాత్రం ఆశావాదానికి  మించి ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఆమె ఏదో  మాట్లాడేస్తున్నారన్న  ఫీలింగు కలుగుతోంది. గతంలో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తానే సీఎం కాబోతున్నానని ప్రకటించారు. చాలా మంది నవ్వుకున్న సంగతి ఆమెకు అర్థం కాలేదనుకోండి. ఆమె పార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఎన్నికల తర్వాత ఆమె   ఇచ్చిన స్టేట్ మెంటు చూసి జనం నవ్వుకున్నారు. 35 నియోజకవర్గాల్లో  తమ  వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆమె అన్నారు. చివరకు ఆమె కాంగ్రెస్ లో చేరితే…గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఆ పార్టీ ఆమెకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవిని కట్టబెట్టింది..

షర్మిల కష్టపడుతున్నారన్నది  నిజం. ఆమె ప్రచారంలో బిజీగా ఉన్నారన్నదీ నిజం. జగన్  ను విలన్ గా చూపించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్నదీ నిజం. కాకపోతే  ఆమెకు ప్రజల్లో బలం ఉందని చెప్పడం మాత్రం కష్టం.కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం అంతకంటే కష్టం. ఎందుకంటే జగన్ కు ఓటెయ్యకూడదనుకున్న వాళ్లు చంద్రబాబుకు వేస్తారే తప్ప షర్మిలకు వేయరన్నది నిజం. ఐనా షర్మిల మాటలు మాత్రం కోటలు దాటడం లేదు…

ఏపీ ప్రజల్లో ఒక వర్గం జగన్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. వాళ్లకి షర్మిల మాట్లాడే మాటలు బాగా రుచిస్తున్న  మాట నిజమే. జగన్ ను వ్యతిరేకించే మీడియా.. షర్మిలను భుజం తట్టి ప్రోత్సహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆ వాపును చూసుకుని షర్మిల బలుపు అనుకుంటున్నారని ఇప్పుడు సోషల్ మీడియా టాక్. ఉట్టికెక్కకుండానే   స్వర్గానికి ఎక్కాలనుకుంటున్నట్లుగా ఉందీ షర్మిల స్టేట్ మెంట్స్. అందుకే కడప ఎంపిగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రినవుతానని ఆమె ప్రకటించేశారు. అది  పరిణితి  లేని స్టేట్  మెంట్ గానే  చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు ఆమె గెలవాలి. తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడు కాంగ్రెస్  పెద్దలకు  షర్మిలను కేంద్రమంత్రిని చేయాలన్న కోరిక కలగాలి. ఇప్పుడు వచ్చిన ప్రతీ సర్వే… కేంద్రంలో బీజేపీకి సునాయాస విజయం ఖాయమని చెబుతున్నాయి. కాంగ్రెస్సే గెలిచే అవకాశం లేనప్పుడు షర్మిల కేంద్రమంత్రి ఎలా అవుతారంటే..ఏమో గుర్రం ఎగరావచ్చు అని సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది…

షర్మిల మరో మాట కూడా అన్నారు. తాను కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఆమె చెప్పుకొచ్చారు. స్పెషల్ స్టేటస్ అంత వీజీ కాదు.అది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్రం ప్రకటించి చాలా రోజులైంది. ఐనా సరే ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నమే స్పెషల్ స్టేటస్ అని చెప్పుకోక తప్పదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి