వీడియో సందేశమే వ్యూహమా ?

By KTV Telugu On 4 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. క్షణం తీరికలేకుండా టూర్లు చేస్తున్నారు. రోజుకు కనీసం రెండు మీటింగులకు హాజరవుతున్నారు. మధ్యమధ్య కర్ణాటక, కేరళ కూడా వెళ్లివస్తున్నారు. ఆయన పక్కనున్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం వెళ్లడం లేదు. అక్కడికి వెళ్లడానికి ఆయన ఇష్టపడటం లేదని కూడా వార్తలు వస్తున్నాయి….

రేవంత్ రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడు. అలా ఉండబట్టే రాజకీయాల్లోకి వచ్చిన 17 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్ట గలిగారు.ఎన్ని పార్టీలు తిరిగినా అన్ని చోట్ల నెగ్గుకురాగలిగారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన  కొద్ది రోజులకే సీనియర్లు అందరినీ పక్కకు నెట్టి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన పదవికి గండం రాకుండా ఆయన  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన ప్రతీ పనిని ఆయన చాకచక్యంగా చేసేస్తున్నారు. తెలంగాణ ఎలా ఉన్నా..అధిష్టానం అదేశిస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేరళ, కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కూడా విస్తృతంగా వెళ్లివచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు.మొక్కుబడిగా మొదట్లో ఒక సారి వెళ్లివచ్చారే తప్ప తర్వాత ఆయన అటుగా దృష్టి పెట్టలేదు. జాతీయ స్థాయి నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రొజెక్టు అవుతున్నా…ఆయన పక్కనున్న ఏపీపై  మాత్రం  శీతకన్నేశారు.

ఏపీలో ప్రచారానికి రావాలని రేవంత్ ను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా  రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఐనా రేవంత్ కనికరించలేదు. మీ అభ్యర్థనల కంటే మా రాష్ట్ర సమస్యలు, వ్యక్తిగత సమస్యలే ముఖ్యమని ఆయన భావించారు. పైగా  రేవంత్ రెడ్డికి గత స్నేహాల కారణంగా కూడా ఏపీకి వెళ్లలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది…

నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి శిష్యుడు. చాలా కాలం టీడీపీలో ఉండేవారు. తెలంగాణలో టీడీపీ బలహీన పడిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. టీడీపీలో ఉంటే పుట్టి మునుగుతుందని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఐనా సరే చంద్రబాబు అంటే ఆయనకు అభిమానమా. తాను ఏపీ  వెళ్లి ప్రచారం చేస్తే టీడీపీ అంచనాలు తారుమారు అవుతాయని రేవంత్ భయపడుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.అందుకే కాంగ్రెస్ తరపున ఏపీలో ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. అదేమని అడిగితే షెడ్యూల్ కుదరడం లేదని రేవంత్ చెబుతున్నారట. ఈ క్రమంలో కనీసం ఒక సారి  కడప వచ్చి మీటింగ్ చెప్పి వెళ్లాలని షర్మిల అభ్యర్థించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఒకటి  రెండు రోజుల్లో రేవంత్ ఒక వీడియో సందేశం  ఇస్తారని మాత్రం టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ కు ఓటెయ్యాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశానికి మంచి జరుగుతుందని ఆయన ఆ వీడియో సందేశంలో చెబుతారట. ఎక్కడ టీడీపీ, జనసేన ప్రస్తావన లేకుండా బీజేపీని, ప్రధాని మోదీని విమర్శిస్తూ ఆయన మాట్లాడతారట.

ఖచితంగా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో తలదూర్చేందుకు తెలంగాణ నాయకులు భయపడతారన్న మాట వాస్తవం. కేసీఆర్ బీఆర్ఎస్ ను ప్రారంభించిన తర్వాత మహారాష్ట్రపై దృష్టిపెట్టారే తప్ప ఏపీలో మీటింగు పెట్టేందుకు కూడా వెనుకాడారు. అక్కడకు వెళితే మాడి మసైపోతామన్న భయం కూడా కేసీఆర్ కు ఉండేదట. బహుశా రేవంత్ కు కూడా అదే ఆలోచన వచ్చి ఉండొచ్చు. మనకెందుకులే ఏపీ సంగతులని ఆయన అనుకొంటుండొచ్చు. చూడాలి వారం పది రోజుల్లో ఏం జరుగుతుందో..

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి