కూటమికి బిగ్ షాక్

By KTV Telugu On 4 May, 2024
image

KTV TELUGU :-

అసలే జనాదరణ లేక వెల వెలబోతోన్న  టిడిపి-బిజెపి-జనసేన కూటమికి షాకులపై షాకులు తగులుతున్నాయి. వారు చేసిన తప్పిదాలే వారిని వెంటాడుతున్నాయి. మూడు పార్టీలూ కలిసి కుట్రలు కుతంత్రాలతో ఎన్నికల ఏరు దాటాలనుకున్నాయి. అయితే  వారి వ్యూహాలు వారికే బెడిసికొట్టడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఏపీలో పాలక పక్షాన్ని ఇబ్బందులు పెట్టడానికి వాలంటీర్లపై ఈసీ చేత ఆంక్షలు విధించేలా చేసిన చంద్రబాబు-పవన్ లు  రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మందిలో వ్యతిరేకత కనిపించేసరికి షాక్ తిన్నారు. దాన్నుంచి కోలుకోకముందే జనసేన గుర్తు గాజు గ్లాసును జనసేన పార్టీకే  రిజర్వు చేయలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో కూటమికి మరో దెబ్బతగిలినట్లయ్యింది.

సంక్షేమ పథకాల ఫలాలను ఇంటింటికీ అందించే వాలంటీర్ వ్యవస్థ వల్ల  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరుగుతోందని భావించిన చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థపై మొదట్నుంచీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేస్తానన్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా వాలంటీర్లపై  అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ప్రజల్లో వాలంటీర్ల పట్ల  సానుకూల దృక్పథం ఉందని గమనించడంతో తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ బాబు, పవన్ లు సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు. పైకి  అలా అంటూనే ఎన్నికల సమయంలో  వాలంటీర్లు ఇంటింటికి పింఛన్లు అందించడానికి వీల్లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు.

చంద్రబాబుకు  ఆప్తుడైన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. దాంతో వాలంటీర్లు ఎన్నికలు అయ్యే వరకు పింఛన్లు అందించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దాంతో  ఏప్రిల్ నెలలో మండు టెండల్లో వృద్ధులు పింఛన్ల కోసం నరకయాతన పడాల్సి వచ్చింది. ఎండ తాకిడి భరించలేక43 మందికిపైడా  పింఛను దార్లు ప్రాణాలు కోల్పోయారు కూడా. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా 66లక్షల మంది పింఛను దార్లతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో కూటమి పార్టీలపై  ఆగ్రహం వ్యక్తమైంది. దీన్ని గమనించిన చంద్రబాబు అనవసరంగా వాలంటీర్ల జోలికి వెళ్లామా అని  నాలిక్కర్చుకున్నారు. తాము వాలంటీర్లకు వ్యతిరేకం కాదని మరోసారి చెప్పారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

వాలంటీర్లపై ఫిర్యాదు చేయించిన టిడిపి ఇపుడు పింఛను దార్ల కష్టాలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే కారణమని దబాయిస్తోంది. అయితే జనం నమ్మడం లేదు. ఈ తలనొప్పితోనే  సతమతమవుతూ ఉంటే  జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును జనసేన పోటీచేసే 21 అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి కేటాయించింది ఈసీ. మిగతా నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ కేటాయిస్తోంది. దీని వల్ల కూటమి ఓట్లకు గండి పడుతుందని భయపడ్డ టిడిపి,జనసేన పార్టీలో కోర్టుకెక్కాయి. గాజు గ్లాస్ గుర్తును జనసేనకు మాత్రమే రిజర్వ్ చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే జనసేనతో పాటు టిడిపికి ఈసీ షాకిచ్చింది.

జనసేన పోటీ చేసే స్థానాల్లో మాత్రమే జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఉంటుందని.. ఇతర నియోజక వర్గాల్లో గ్లాసు గుర్తును  రిజర్వ్ చేయాలన్న జనసేన డిమాండ్ ను  ఆమోదించే పరిస్థితి లేదని న్యాయస్థానంలో ఈసీ  స్పష్టత ఇచ్చింది. ఇతర స్థానాల్లో ఇప్పటికే గాజు గ్లాసు గుర్తు కేటాయించిన వారికి ఇపుడు గుర్తులు మార్చడం సాధ్యం కాదని.. ఎన్నికల ప్రక్రియ మొదలైపోయిన  నేపథ్యంలో  జనసేన పిటిషన్ కు అసలు విచారణ అర్హతే లేదని ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఇటువంటి పిటిషన్లను పట్టించుకుంటూ పోతే ఎన్నికల వరకు ఎవరో ఒకరు పిటిషన్లు వేస్తూనే ఉంటారని ఈసీ స్పష్టం చేసింది.

హైకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందనుకున్న టిడిపి,జనసేనలకు  ఈసీ నిర్ణయం కోలుకోలేని షాకే అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే చాలా నియోజక వర్గాల్లో టిడిపి,జనసేన తిరుగుబాటు అభ్యర్ధులు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు. వారిలో చాలా మందికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. మే 13న జరగనున్న ఎన్నికల్లో  ఈ పరిణామం మూడు పార్టీల కూటమికి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి